కన్యారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అతి చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. మిక్కిలి లాభపడతారు. 15 మే 2025 వరకు పితృ వర్గీయుల వలన అధికంగా లాభపడతారు. పితృ వర్గ సహకారం వలన మీ ప్రణాళికలను ఆచరణలో పెట్టగలుగుతారు. వారసత్వ తగాదాలు అన్ని పరిష్కారం అవుతాయి. స్వార్జిత నిలువ ధనం కూడా పెరుగుతుంది. 16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు వైవాహిక విషయాలు మిక్కిలి అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతం అగును. జీవిత భాగస్వామి వర్గీయుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో పుణ్య క్రతువులు నిర్వహించబడతాయి. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురు గ్రహం వలన ఆర్ధికంగా అధిక లాభాలను పొందుతారు. వ్యక్తిగత జాతకంలో గజ కేసరి యోగం ఉన్న వారికి విశేష భాగ్య సంపదలు లభిస్తాయి. 6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చ్ 2026 వరకు కూడా గురు గ్రహం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబ పేరు ప్రతిష్టలు పెంచగలుగుతారు. కనిష్ట భాత్రు వర్గం వారి పట్ల మీ భాద్యత పెరుగుతుంది. వారి ముఖ్య అవసరాలకు సహాయ పడగలుగుతారు. వివాహ సంబంధ ప్రయత్నాలకు ఇది చక్కటి కాలం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న హస్తా నక్షత్రంలో జన్మించిన వారు శతబిషా నక్షత్రంలో జన్మించిన వారిని మాత్రం వివాహం చేసుకోకూడదు. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సరం అంతా గురు గ్రహం వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.
కన్యారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోను సూచనలు అధికంగా ఉన్నాయి. శని గ్రహ ప్రతికూల ప్రభావం వలన సంతానం కూడా మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. బాగా ఎదిగిన సంతాన విద్యాసంబంధ విషయాల్లో మీ నిర్ణయాలు ఇబ్బందులను కలుగచేస్తాయి. న్యాయస్థాన తీర్పులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. చట్టరీత్యా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. నూతన శత్రుత్వాల వలన ఇబ్బందులు ఎదురగును. కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
కన్యారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 18 మే 2025 వరకు తరచుగా తేలికపాటి ఆరోగ్య సమస్యలు ఎదురగును. జీవిత భాగస్వామి సహకారం ఆశించిన విధంగా ఉండదు. వివాహ ప్రయత్నాలు చివరి నిమిషంలో నిరాశ పరచును. 19 మే 2025 నుండి స్థిరాస్థి సంబంధ విషయాల్లో అనుకూలత లభిస్తుంది. వారసత్వ సంపద పరంగా లాభ పడతారు. సొంత గృహ సంబంధ విషయాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్యారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. 18 మే 2025 వరకు అదృష్ట హీనత బాదించును. రాహు గ్రహం వలనే కేతువు కూడా ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలుగచేయును. ఈ సంవత్సరం అంతా కన్యా రాశి వారు ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. 19 మే 2025 నుండి కేతు గ్రహం వలన ధన వ్యయం అదుపు తప్పుతుంది. పారమార్ధిక చింతన అధికం అవుతుంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గురువు మరియు రాహు గ్రహం వలన మాత్రమే అనుకూల ఫలితాలు లభిస్తాయి. శని గ్రహం వలన మరియు కేతు గ్రహం వలన ప్రతికూల ఫలితాలు ఎదురగును. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ మరియు కేతు గ్రహ దోషాలు కలిగి ఉన్న జాతకులు గ్రహ శాంతులు జరుపుట మంచిది.
ఏప్రిల్ 2025 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో పరిస్థితులు క్రమంగా మెరుగవును. ధనాదాయం క్రమంగా పెరుగును. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో ప్రోత్సాహం లభించును. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు ఏర్పడును. పై అధికారుల వలన లాభం ఉంటుంది. స్త్రీలకు కీళ్ళ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలుగ చేయును. ఈ మాసం భాగస్వామ్య వ్యాపార విస్తరణకు మంచి సమయం. కుటుంబ విషయ సంబంధ ప్రయాణాలు ఏర్పడతాయి మరియు లాభకరంగా పూర్తి అగును. చివరి వారంలో వివాహ సంబంధ అనుకూలత ఉన్నది. గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వర్తిస్తారు.
మే 2025 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆకస్మిక అనారోగ్య సమస్యల వలన ఒత్తిడి ఎదుర్కుంటారు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. అవసరములకు రావలసిన ధనం చేతికి వచ్చును. 12 వ తేదీ నుండి 16 వ తేదీ మధ్య కాలంలో ప్రయనాలందు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో వాహన ప్రమాద సూచన ఉన్నది. తృతీయ వారం సామాన్య ఫలితాలను కలుగ చేయును. చివరి వారంలో అధిక ధన వ్యయం మరియు సొంత ఆరోగ్య విషయాలలో చికాకులను కలుగచేయును. ఉద్యోగ ప్రయత్నాలలో ఆశా భంగములు ఎదుర్కొంటారు. చివరి నిమిషంలో అవకాశములు కోల్పోతారు. 24, 25, 26 తేదీలలో ఉద్రేక సంభాషణల వలన ఒక నష్టం ఎదుర్కొందురు. సంభాషణల్లో ఉపయోగించు పదాల పట్ల జాగ్రత్త అవసరం.
జూన్ 2025 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వ్యక్తిగత జీవితంలో శుభకరమైన ఫలితాలు ఏర్పడును. నూతన వ్యాపార ప్రారంభకులకు కార్య సిద్ధి లభిస్తుంది. స్త్రీలు ఆశ్చర్యకరమైన బహుమతులు పొందుతారు. ప్రధమ, ద్వితీయ వారములలో తలపెట్టిన ప్రయాణాలు సౌఖర్య్యవంతంగా పుర్తి అగును. తృతీయ వారంలో అఖస్మిక శారీరక రుగ్మతలు చికాకులను కలుగచేయును. జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి ఏర్పడును. వారి నుండి కృతజ్ఞతను ఆశించ వద్దు. చివరి వారం సామాన్య ఫలితాలను కలుగచేయును. మొత్తం మీద ఈ మాసంలో ధనానికి లోటు ఏర్పడదు.
జూలై 2025 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో శరీర ఆరోగ్యం సహకరించును. సంతానం వలన మానసిక ఉల్లాసం లభించును. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. గృహంలో బంధు మిత్రుల కలయిక ఏర్పడును . పితృ వర్గీయుల కొరకు ధన వ్యయం చేయ వలసి వస్తుంది. ఉద్యోగ సంబంధ స్థాన చలన ప్రయత్నములకు ద్వితీయ , తృతీయ వారములు అనుకూలంగా ఉండును. తలపెట్టిన పనులలో ఏర్పడుతున్న ఆటంకములు తొలగును. అధికారులతో వివాదాలు తొలగును. ధనాదాయం బాగుండును. సినీరంగ వ్యాపారములు చేయు వారికి మాత్రం ఆశించిన లాభములు లభించుట కష్టం. భారీ పెట్టుబడులు పెట్టుటకు ముందు కుటుంబ పెద్దల సలహాలు తీసుకొనుట మంచిది.
ఆగష్టు 2025 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసం కూడా అనుకూలమైన ఫలితాలు కలుగచేయు మాసం. చిరకాలంగా ఉన్న నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరును. ఆశించిన విధంగా ధనార్జన లభిస్తుంది. గత కాలపు పెట్టుబడుల నుండి ధనం చేతికి లభించును. గృహ సంబంధ క్రయవిక్రయాలందు మధ్యవర్తిత్వం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందురు. ఈ మాసంలో ఆలోచనలు సక్రమంగా ఉండును. కార్య భారం తగ్గుతుంది. తోటి ఉద్యోగుల నుండి చక్కటి సహకారం పొందుతారు. తృతీయ వారంలో మాతృ వర్గీయులతో ఆర్ధిక సంబంధ విషయాలందు విభేదాలు ఏర్పడును. నూతన విషయాల పట్ల ఆసక్తి పెరుగును. వ్యక్తిగత జీవనం ఆనందకరంగా కొనసాగుతుంది.
సెప్టెంబర్ 2025 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కుటుంబ పరిస్టితులు మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు ఆర్ధికంగా వివాదాలను కలుగచేయును. తొందరపాటు నిర్ణయాలతో భాగస్వామ్య వ్యాపారములందు పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. ద్వితీయ వారం లోపున వాయిదా పడుతూ వస్తున్న ఇష్ట దైవ సందర్శన ఏర్పడును. పారమార్ధిక చింతన అలవరచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారములు మినహా మిగిలిన రంగాల వారికి ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులకు రుణ విషయములందు వ్యక్తిగత హామీలు ఇవ్వకండి. ఈ మాసంలో చేయు వివాహ , సంతాన ప్రయత్నములు లాభించును. పుత్ర సంతానమునకు ఈ మాసం అనుకూలమైన కాలం.
అక్టోబర్ 2025 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంఘర్షణ సంబంధిత చికాకులు మాత్రం కొనసాగును. సొంత మనుష్యుల నిరాదరణ మానసికంగా బాధించును. ఈ మాసంలో దూర ప్రాంత , పరదేశ స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. ద్వితీయ వారంలో శరీరమునకు కార్య భారం వలన అలసట ఏర్పడును. ఉద్యోగ జీవనలో ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆలోచనలు ముందుకు సాగవు. నూతన వ్యాపారాలు అంతగా రాణించవు. చివరి వారంలో మిత్రులే శత్రువులగుదురు. మీకు అపఖ్యాతిని ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తిగత విషయాలు అన్నింటిని మిత్రులతో ప్రస్తావించట మంచిది కాదు.
నవంబర్ 2025 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. ఉహించని విధంగా వ్యాపార వ్యవహారములందు ఆదాయం తగ్గును. భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసుకున్న నిల్వ ధనం కూడా అవసరాలకు ఉపయోగించవలసి వచ్చను. వైవాహిక జీవితంలో ఆశించిన సంతోషాలు లభించవు. పెట్టుబడులు, శారీరక శ్రమ వృధా అగును. మానసికంగా ఒంటరితనం బాధించును. 13 వ తేదీ తదుపరి తలపెట్టిన ఏ ప్రయత్నం అనుకూలించక నిరాశ ఆవహించును. ఈ మాసంలో 16, 17, 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు.
డిసెంబర్ 2025 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ పరిస్థితులు ఎదుర్కొందురు. ప్రధమ అర్ధ భాగంలో ఉద్యోగ జీవన నష్టం, కార్య విఘ్నతలు, చిన్న పిల్లలకు శారీరక హాని, వృత్తి - వ్యాపార రంగం వార్కి ఆదాయంలో తగ్గుదల, వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి వంటి అననుకూల ఫలితాలు ఏర్పడతాయి. 19 వ తేదీ తదుపరి అనవసర ఖర్చులు తగ్గుతాయి. నూతన అవకాశములు లభిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. నూతన కుటుంబ సంబంధాలు ఏర్పడుతాయి. ఈ మాసంలో 4, 7 9, 12 , తేదీలు అనుకూలమైనవి కావు.
జనవరి 2026 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసం బాగుంటుంది. ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్నవారికి ఉపశమనం లభించును. ప్రభుత్వ అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యలు తొలగును. నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నములు చేయుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో పదోన్నతిని ఆశించవచ్చు. ధార్మిక కార్యక్రమాలకు సహకరిస్తారు. శ్రమ వలన పేరు ప్రఖ్యాతలు ఆర్జిస్తారు. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. మనోబలం పెరుగును. గురువులు , పెద్దల సహాయ సహకారములు లభించును. ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు.
ఫెబ్రవరి 2026 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసం ప్రారంభ రోజులలో ద్రవ్య లాభం పొందుతారు. బంధు వర్గం వలన సహకారం పొంది నూతన స్తిరాస్తులను ఏర్పాటు చేసుకొంటారు. వృత్తి జీవనంలోని వారికి గౌరవం, చక్కటి అభివృధ్హి ఏర్పడును. విదేశీ జీవనం చేయువార్కి ఈ మాసం కలసిరాదు. సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించుదురు. సంతానంతో విరోధములు ఏర్పడును. స్త్రీలకు అపవాదులు భాదించును. మనశ్శాంతి లోపించును. మాసాంతమునకు ప్రతీ వ్యవహారం శ్రమకరంగా ఉండును. ముఖ్యంగా 26, 27, 28 తేదీలు మంచివి కావు.
మార్చ్ 2026 కన్యారాశి రాశిఫలాలు:
ఈ మాసంలో గృహంలోనూ , వృత్తి వ్యాపార ఉద్యోగ జీవనంలో అనుకూలమైన పరిస్థితిలు ఏర్పడతాయి. చక్కటి లాభకరమైన వాతావరణం మరియు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. నూతన వాహన సంబంధ ప్రయత్నాలు లాభించును. కాలయాపన చేస్తూ , వాయిదా వేస్తూ వస్తున్న పనుల వలన మరింత ఇబ్బందులు ఎదుర్కొందురు. 16 నుండి 21 వ తేదీ మధ్య ఆహార సంబంధ అనారోగ్యం భాదించు సూచన.