• 2025 - 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సర తులారాశి రాశీ ఫలాలు

    Sree Viswavasu Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu

     

    • చిత్త 3,4 పాదములు లేదా స్వాతి 1,2,3,4 పాదములు లేదా విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులారాశికి చెందును.
    • శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం - 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 02, అవమానం - 02
    • పూర్వ పద్దతి లో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఏర్పడు లాభకరమైన జీవనాన్ని సూచించుచున్నది.

    తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు పొందుతారు. 15 మే 2025 వరకు అధికమగు కుటుంబ పరమైన ఖర్చుల వలన సమస్యలు ఎదుర్కొందురు. మాత్రు వర్గమునకు అవసరమగు ధనం సర్దుబాటు చేయుట కష్టం అవుతుంది. నూతన శత్రుత్వాలు బాదిస్తాయి. 16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకూ కొద్దిపాటి అనుకూల ఫలితాలు పొందుతారు. వారసత్వ సంబంధ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.  స్థిరాస్థి కి సంబందించిన లాభములను పొందుతారు. భాత్రు వర్గంతో సఖ్యత ఏర్పడుతుంది. 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు మంచి అనుకూల ఫలితాలు పొందుటకు సూచనలు ఉన్నవి. దూర దేశ నివాస లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి ఈ కాలం చక్కటి అనుకూల కాలం. విహార యాత్రలు చేయాలనే ఆలోచన కార్యరూపము దాల్చును. ఈ కాలం లో చేయు ప్రయాణాలు ఫలప్రదం అవుతాయి. ఆచార సాంప్రదాయాల పట్ల ఆశక్తి ప్రదర్శిస్తారు. 6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చ్ 2026 వరకు ప్రతికూల ఫలితాలు పొందుతారు. చిన్న విషయాలకు కూడా తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది. ఈ కాలంలో స్థిరాస్థి సంబంధ క్రయ విక్రయాలు మాత్రం లాభాలను కలుగచేస్తాయి. 

    తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. విదేశీ సంబంధ వ్యవహారాలలో చక్కటి అనుకూలత పొందుతారు. కుటుంబములోని పెద్ద వయస్సు వారి తీర్ధయాత్రల కోరిక నేరవేర్చగలరు. వ్యక్తిగత జాతకంలో శని స్వక్షేత్రంలో ఉన్న వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆర్ధికంగా మిక్కిలి లాభకరంగా ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

    తులారాశి వారికి  శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన ఒక్క సంతాన సంబంధ విషయాలలో మినహా మిగిలిన అన్ని విషయాలలో చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. 18 మే 2025 వరకు ఆర్ధికంగా బాగా కలసి వస్తుంది. వ్యాపార వర్గము వారికి అధికంగా అనుకూలత ఉంటుంది. 19 మే 2025 నుండి సంతాన సంబంధ సమస్యలు బాధిస్తాయి. కానీ ఆర్దిక్గంగా బాగానే ఉంటుంది. 

    తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. పారమార్ధిక చింతన అధికం అవుతుంది. ధ్యాన మార్గంలో ఉన్నవారికి ఉచ్చ యోగం లభిస్తుంది. ఆర్ధికంగా చక్కటి అనుకూల కాలం. 19 మే 2025 నుండి సదా సద్వయం చేయుదురు. మొత్తం మీద తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఒక్క గురు గ్రహం వలన మాత్రమే ప్రతికూల ఫలితాలు ఏర్పడును. శని, రాహు మరియు కేతు గ్రహముల వలన లాభకరంగా ఉంటుంది. 

    ఏప్రిల్ 2025 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అపరిష్కృతంగా ఉన్న తగాదాలు పరిష్కారమగును. ధనాదాయం ఆశించినంత ఉండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతం అగును. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా వాహన సంబంధ వ్యాపారాలు చేయువారికి బాగా కలసి వచ్చును. ఈ మాసంలో 9 వ తేదీ నుండి 17 వ తేదీ మధ్య కొద్దిపాటి వృధా ధన వ్యయం మరియూ అనారోగ్య సూచన. 19, 20, 21 తేదీలు వివాహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలం. 27 నుండి మాసాంతం వరకూ ఉద్యోగ జీవనంలో శ్రమ అధికమగును. ఒత్తిడులు ఎదుర్కొందురు.

    మే 2025 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసం ప్రధమ అర్ధ భాగంలో వైవాహిక జీవనంలో పట్టుదల, ఉద్రిక్తతలు ఎదుర్కొందురు. భూ సంబంధ కొనుగోలు ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. వివాహ మరియు సంతాన ప్రయత్నాలు విఫలమగును. ఉన్నత అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. గత మాసపు ఉద్యోగ జీవన ఒడిదుడుకులు తొలగును. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉండును. నిరుద్యోగులు మరింత దీక్షా , పట్టుదలను ప్రదర్శించాలి. చివరి వారంలో ఆత్మీయులతో ఉన్న వివాదాలు సర్దుబాటు చేసుకొందురు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను కష్టం మీద చివరి నిమిషానికి పూర్తీ చేయగలుగుతారు. స్నేహితుల సహకారం లభించును. రాజకీయ రంగంలోని వారికి ఊహించని అవకాశములు లభించును. ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు లాభించును.

    జూన్ 2025 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యక్తిగత జీవన విషయాలలో సౌఖ్యం ఉన్నది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలనుండి ఉపశమనం లభించును. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. సామజిక కార్యక్రమాలలో మీ శ్రమకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. గౌరవింప బడతారు. స్థాన చలన ప్రయత్నాలు , ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు లాభించును. నిరుద్యోకులకు ద్వితీయ, తృతీయ వారములలో మంచి అవకాశములు లభించును. రాజకీయ పలుకుబడి పనికి వచ్చును. పేరు - ప్రతిష్టలు సంపాదించుకొందురు. స్త్రీలకు నూతన వస్తు - ఆభరణాలు ప్రాప్తించును. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వ్యాపార వ్యవహారములు ఆశించిన విధంగా కొనసాగును.

    జూలై 2025 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ఆర్ధిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు. వృత్తి జీవనంలో పనులు తీవ్ర జాప్యం ఎదుర్కొందును. కొన్ని విషయాలు మానసికంగా చికాకులు లేదా గౌరవ హాని కలుగచేయును. భాత్రు వర్గం వారి సహకారంతో సమస్యలు పరిష్కారమగును. 10వ తేదీ తదుపరి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడును. నూతన అవకాశములు లభించును. వివాహ ప్రయత్నాలు విజయవంతం అగును. వ్యాపార విస్తరణ అవకాశములు లభించును. విదేశీ విద్య ఆశిస్తున్న వారికి ప్రయత్న పుర్వక లాభం ఏర్పడును. ఈ మాసంలో 2, 3, 8, 13 తేదీలు అంత అనుకూలమైనవి కావు. ఈ మాసం మొత్తం మీద ధనాదాయం కొంత తగ్గును.

    ఆగష్టు 2025 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధన వ్యయం తగ్గును. దూరప్రాంత జీవన ప్రయత్నాలు చేయు వారు ఆటంకములు ఎదుర్కొందురు. ఈ మాసంలో మాతృ వర్గీయులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు కలవు. అఖస్మిక ప్రయాణాలు ఏర్పడును. నూతన ఆలోచనలు, వ్యాపార లావాదేవీలు సమస్యలతో కొనసాగును. ఉద్యోగ జీవనంలో కూడా ఊహించని సమస్యలు ఇబ్బంది పెట్టు సూచన. విలువైన వస్తువులు పోగొట్టుకొనే అవకాశము ఉన్నది. స్థాయిని మించిన సహాయములు చేయుట వలన చేతిలో ధనం నిలువదు. ఇతరుల సమస్యలలో కలుగచేసుకోనుట వలన గౌరవ హాని సూచనలు కలవు. ముఖ్యంగా 15, 16, 17 తేదీలలో సమన్వయంతో వ్యవహరించుట మంచిది.

    సెప్టెంబర్ 2025 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధన సంబంధమైన సమస్యలు కొద్దిగా తగ్గును. నూతన వ్యాపార వ్యవహారాలు మాత్రం సమస్యలు కలిగించును.స్నేహ వర్గం నుండి ఆశించిన సహకారం ఉండదు. స్వతంత్రంగా వ్యవహారములు చక్కపెట్టుకోవాలి. స్నేహితులపై ఉన్న నమ్మకం దెబ్బతినును. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందును. విద్యార్ధులకు కోరకున్న విద్యా ప్రవేశాలు లభిస్తాయి. పుణ్య క్షేత్ర సందర్శన ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొందురు. ఈ మాసంలో 9 నుండి 20 తేదీ మధ్యకాలం వివాహ - సంతాన- నూతన గృహ నిర్మాణ సంబంధ పనులు చేయుటకు అనువైన కాలం.

    అక్టోబర్ 2025 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధన ఆదాయం అవసరములకు సరిపోతుంది. కుటుంబ పరమైన ఖర్చులు అధికం అగును. గృహంలో శుభ కార్యములు నిర్వహించెదరు. సంతానానికి సంతోషాన్ని కలుగచేయుదురు. నూతన కార్యములకు రూపకల్పన చేయుదురు. ఉద్యోగ జీవనం సాఫీగా కొనసాగును. సంతన లేమీ దంపతుల సంతాన ప్రయత్నాలు విజయం పొందును. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక వ్యక్తిగత వ్యవహార సమస్య తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోదర వర్గం మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయం మీద ఆధారపడిన వారికి ఈ మాసంలో తీవ్ర ప్రతికూలత ఎదురగును. పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

    నవంబర్ 2025 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ప్రారంభ వారములు అనుకూల ఫలితాలు ఇచ్చును. తృతీయ వారం నుండి వ్యతిరేక ఫలితాలు ప్రారంభం అగును. వైవాహిక జీవనంలో తీవ్ర మార్పులు , సమస్యలు ఏర్పడును. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల తీర్పులు. ధనం వృధాగా వ్యయం అగును. వృత్తి - వ్యాపారములందు చాలా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. రాబోవు కాలం అంత అనుకూలమైనది కాదు. ఈ మాసంలో రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం, వివాహాలు కుదుర్చుకోవడం, స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరపడం, నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. దూర ప్రాంత ప్రయాణాలకు ఈ మాసం కూడా అనువైనది కాదు. ఈ మాసంలో 20, 21, 22, 23, 27,28 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకోని కలహాలకు అవకాశం ఉన్నది.

    డిసెంబర్ 2025 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సున్నితమైన విషయాల్లో మానసిక ఆందోళన ఏర్పడును. ఈ మాసంలో 13, 14 తేదీలు మినహా మిగిలిన రోజులలో ప్రయాణాలు చేయవచ్చు. విదేశీ నివాస ప్రయత్నాలు చివరి నిమిషంలో విజయవంతం అవుతాయి. వృత్తి జీవనం ద్వారా ధనార్జన చేయువారు జాగ్రత్తగా ఉండవలెను. మనో నిగ్రహాన్ని ప్రదర్శించాలి లేనిచో అపఖ్యాతి పాలగుదురు. ప్రస్తుత హోదాను కోల్పోవుదురు. అఖస్మిక వ్యవహార నష్టములకు సూచనలు కలవు. ఈ మాసంలో గురు గ్రహ శాంతి జపము జరిపించుకోనుట మంచిది.

    జనవరి 2026 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. మానసికంగా ఇబ్బంది పెట్టె అనుభవాలు తరచుగా ఉండును. చేపట్టిన పనులలో తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొందురు. ద్వితీయ వారంలో వివాహ సంబంధ ప్రయత్నాలు విజయవంతం అగును. వాగ్ధాన భంగములు చేయకండి. ఉన్నత అధికారులతో మాటకలయికలో ఇబ్బందులు ఎదురగును. తృతీయ వారంలో సోదర వర్గం నుండి సహకారం లభించును. సంతాన సంబంధ శుభవార్త. అవసరములకు ధనం సర్దుబాటు అగును. ఈ మాసంలో 7, 8, 10, 12, 13, 17 తేదీలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనరాదు. అగ్రిమెంట్లు చేయరాదు. మానసిక ధైర్యం తగ్గును. 22 వ తేదీ తదుపరి కొంత వరకూ ఇబ్బందులు తగ్గును. పరిష్కార మార్గములు కనిపిస్తాయి.

    ఫెబ్రవరి 2026 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మనస్పర్ధలు తొలగును. భాగస్వామ్య వ్యాపారములు ఈ మాసంలో కలసి వస్తాయి. వ్యాపారులకు ధనాదాయం పెరుగును. రుణాలు తీర్చగులుగుతారు. నూతన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ మాసంలో తీవ్ర ప్రతికూల ఫలితాలు, అనుకూలం కాని రోజులు లేవు. ప్రయాణాలు చేయుట వలన మానసికంగా ప్రశాంతత లభించును. నూతన ప్రణాళికలు రచించుకొందురు. కొత్త సంబంధాలు ఏర్పడును. బంధు వర్గానికి సహాయం చేసెదరు.

    మార్చ్ 2026 తులారాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధనాదాయం కొంత పెరుగును. నూతన గృహ నిర్మాణాలకు చేయు ప్రయత్నాలు ఫలించును. దీర్ఘాలోచనలు కలసి వచ్చును. వివాదాలలో రాజీలు చేసుకొందురు. నిరుద్యోగులకు కూడా ఈ మాసం ఆశాజనకంగా ఉండును. స్థాన చలన లేదా ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయవచ్చు. నూతన పెట్టుబడులు కలసి వచ్చును. మాస మాధ్యమంలో సువర్ణ లాభం ఉన్నది. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ పెద్దలను మెప్పించగలరు.