• 2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు

    Sree Viswavasu Nama Samvatsara Simha Rasi / Leo Sign Free Telugu Rasi Phalalu

     

    • మఘ 1,2,3,4 పాదములు లేదా పుబ్బ 1,2,3,4, పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.
    • శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఆదాయం - 11, వ్యయం - 11, రాజ పూజ్యం - 03, అవమానం - 06.
    • పూర్వ పద్దతిలో సింహ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "5". ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారు ఎదుర్కొనవలసి అపవాదులను, మానసిక చికాకులను సూచించుచున్నది.

    సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును. 15 మే 2025 వరకు అతి చక్కటి అనుకూల ఆర్ధిక లాభములను పొందుతారు. ముఖ్యంగా న్యాయవాద వృత్తి జీవనం చేయువారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇతర వృత్తి జీవనం వారు మిక్కిలి న్యాయవంతంగా ఆశించినంత ధనార్జన చేయగలుగుతారు. మీ చేతిపై విశేష సత్కార్యములు జరుగుతాయి. మంచి ఖ్యాతి ని గడిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సంతాన ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. 16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు వ్యాపార రంగంలోని వారికి విశేష అనుకూలత ఏర్పడుతుంది. నూతనంగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన వారికి ఈ కాలం అతి చక్కటి కెరీర్ ని ప్రసాదించును. అన్ని వృత్తుల వారికి ఆర్ధికంగా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురు గ్రహం వలన అంత అనుకూల ఫలితాలు ఏర్పడవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం కంటే వ్యయం అధికం అవుతుంది. 6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న కాలం గురు గ్రహ బలం వలన చక్కగా లాభిస్తుంది. ఆర్ధికంగా అనుకూలత ఉంటుంది. రుణ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ జీవనంలో  అభివృద్ధి పొందడానికి ఈ కాలం అనుకూలమైనది. 

    సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం లోపించిన వారికి శని వలన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురగును. వివాహ ప్రయత్నాలు చేయు వారికి శని వలన అంత అనుకూలత ఉండదు. వివాహ ప్రయత్నాలకు అనేక ఆటంకాలను ఏర్పరచును. శత్రుత్వాలు అధికం అవుతాయి. అవసరమగు సందర్భంలో మీ వాక్చాతుర్యమును ఉపయోగించుకోలేరు. సింహ రాశి వారు ఈ సంవత్సరం అంతా వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. సింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

    సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన కూడా సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఆరోగ్య విషయాలలో, కళత్ర సంబంధ విషయాలలో, తగాదాలకు సంబందించిన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. సింహ రాశి వారు ఈ సంవత్సరం ఇతరులకు పెద్ద మొత్తాలలో ఋణాలు ఇవ్వకుండా ఉండడం మంచిది. 

    సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలే ఎదురగును. ఈ సంవత్సరం కేతు గ్రహం వలన సింహరాశి కి చెందిన పిల్లలకు తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదురగు సూచన ఉన్నది. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగి ఉన్న వారు తరచుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకాలు జరిపించుకోనుట మంచిది. మొత్తం మీద సింహ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఒక్క గురు గ్రహం మాత్రమే అనుకూల ఫలితాలు కలుగచేయును

    ఏప్రిల్ 2025 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో తలపెట్టిన ప్రతీ కార్యం, ఆలోచన లాభించును. గతకాలపు సమస్యలు తొలగును. కార్య సిద్ధి, ఆర్ధిక అభివృద్ధి ఏర్పడును. వృధా ధనవ్యయం తగ్గును. చేతిపై ధనం నిలుచును. శారీరక స్వస్థత ఏర్పడును. గృహ సంబంధ లేదా భూ సంబంధ స్థిరాస్థి లాభం ఏర్పడును. వివాదాలు తొలగిపోవును. అరుదైన అవకాశములు లభించును. శుభవార్తలు వింటారు. సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పరచును. 24 వ తేదీ నుండి 29 వ తేదీ మధ్య కాలంలో సింహ రాశికి చెందిన స్త్రీలకు గర్భ లేదా ఉదర సంబంధ సమస్యలున్నాయి.

    మే 2025 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ప్రధమ వారంలో మిత్రులతోనూ , అధికారులతోనూ విభేదములు ఏర్పడును. ద్వితియ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం కొంత తగ్గును. తృతీయ వారంలో సంతానం వలన సౌఖ్యత ఏర్పడును. కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉన్నాయి. క్రీడా రంగంలోని వారికి చక్కటి విజయములు లభించును. 20 వ తేదీ తదుపరి ఆర్ధిక పరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమగు సూచనలు ఉన్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులు ఈ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలెను.

    జూన్ 2025 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో జీవనంలో గౌరవ హోదాలు పెరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభించును. ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు. కుటుంబ సంతోషములు ఉన్నాయి. ఆశించిన విధంగా స్థానచలనం పొందుతారు. అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు. ద్వితీయ వారం తదుపరి నూతన వ్యాపారములు ప్రారంభించుటకు అనుకూలత లభించును. మాసాంతంలో సంతాన భవిష్యత్ గురించిన ఆందోళన ఏర్పడు సూచన.

    జూలై 2025 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం బాగుండును. పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభములు ఏర్పడును. వృత్తి వ్యాపారములు సామాన్యం. జీవిత భాగస్వామి మూలక ధన లాభములు. మాసం మొత్తం మీద ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును.

    ఆగష్టు 2025 సింహరాశి రాశిఫలాలు:

    ఈ మాసంలో కూడా గత మాసపు అనుకూల ఫలితాలు కొనసాగును. ధనాదాయం సామాన్యం. ద్వితీయ వారంలో కుటుంబంలోని పెద్ద వయస్సు వారికి ఆరోగ్య భంగములు. 4,7,13,17,22 తేదీలలో వృత్తి వ్యాపారాలలో చక్కటి ధన ఆదాయం. నూతన ప్రయత్నములలో సులువుగా విజయం చేకూరును.

    సెప్టెంబర్ 2025 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మానసిక అధైర్యం ఏర్పడును. ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతితో బాధపడుదురు. కుటుంబంలో అనవసరమైన కలహములు ఏర్పడి అపకీర్తి పొందుతారు. తృతీయ వారం వరకూ కార్య విఘ్నములు ఏర్పడుచుండును. 18, 19 తేదీలలో ప్రయాణములలో ప్రమాద సూచన. జాగ్రత్త అవసరం. ఈ మాసంలో కాలం అంతగా కలసి రాదు. ధనాదాయం సామాన్యం.

    అక్టోబర్ 2025 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో పోటీ పెరిగి ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది. తల్లితో లేదా మాతృ వర్గీయులతో విభేదాలు భాదించును. ఉద్యోగ జీవనంలో 22, 23, 24, 25 తేదీలలో ఉన్నత అధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కెరీర్ కు సంబందించిన ఆందోళన అధికం అగును. ఈ మాసంలో ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నించుట మంచిది కాదు. వైద్య రంగంలో ధనార్జన చేయు వారు 22 నుండి 26 వ తేదీల మధ్య కాలంలో జాగ్రత్తగా ఉండవలెను. అనవసర తగాదాలు ఎదుర్కొంటారు.

    నవంబర్ 2025 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసం అనుకూలమైన కాలం. ప్రతీ కార్యం దైవ ఆశీస్సులతో విజయం పొందును. కుటుంబ కలహాలు తొలగి బంధువుల, స్నేహితుల తోడ్పాటు లభించుట వలన కష్టములు నుండి బయటపడుడురు. ఆశించిన విధంగా ధన ప్రాప్తి పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగముల వారికి ఈ మాసం అనుకూల ఫలితాలను కలుగచేస్తుంది. మీ చేతి మీద పుణ్యకార్యములు నిర్వహిస్తారు.

    డిసెంబర్ 2025 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో గత కాలంలో నిలిచిపోయిన పనులు, కార్యములను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన సంబందిత విషయాలలో మాత్రం చికాకులు ఏర్పడును. సంతానం కొరకు అధికంగా ధనం ఖర్చుపెట్టవలసి వచ్చును. స్నేహితుల పనులు కోసం వృధాగా శ్రమించవలెను. గృహ సంతోషములు మధ్యమం. ఈ నెలలో 22 నుండి 29 తేదీల మధ్య ఆర్ధిక సంబంధ కార్యక్రమాలలో జాగ్రత్త వహించవలెను. చివరి వారంలో వ్యాపార రంగంలోని వారికి ఆకస్మికంగా ధనాదాయం స్థంభించును.

    జనవరి 2026 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ప్రధమ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. 5,6 తేదీలు విదేశీ సంబంధ ప్రయత్న వ్యవహారాలకు అనుకూలమైనవి. ద్వితియ వారంలో ఆర్ధిక ఋణములు తీరును. నూతన పరిచయాలు ఏర్పడును. తృతీయ వారం నుండి సామాన్య ఫలితాలు. 25 వ తేదీ తదుపరి గృహంలో శుభకార్య సంబంధ ఉత్సాయపూరిత వాతావరణం. మాసం మొత్తం మీద ధనాదాయం బాగుండును.

    ఫెబ్రవరి 2026 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో సంతాన సంబంధ ప్రయత్నాలలో చక్కటి లాభములు పొందుతారు. ఆశించిన విధంగా సంతాన ప్రాప్తి ఏర్పడును. ధనాదాయం సామాన్యం. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి ఏర్పడు సూచన. అందరి మన్ననలూ లభించును. ద్వితియ వారం తదుపరి నూతన గృహ ప్రయత్నములు ఫలించును. వ్యక్తిగత జీవనంలో ఆందోళనతో కూడిన ఆలోచనలు అధికమగును. ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తుంది. ఈ మాసంలో ప్రారంభించు నూతన వ్యాపారములు విజయవంతం అగును.

    మార్చ్ 2026 సింహరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో విద్యార్ధులకు అఖండ విజయం ఏర్పడును. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి నిపుణులకు సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు. ద్వితియ మరియు తృతీయ వారములు సామాన్య ఫలితాలు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. ఈ మాసంలో 19, 20, 25, 26, 27 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

  •