• 2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు

    Sree Viswavasu Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Free Telugu Rasi Phalalu

     

    • పునర్వసు నక్షత్ర 4వ పాదం లేదా పుష్యమీ నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.
    • శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 02, రాజ పూజ్యం - 07, అవమానం - 03
    • పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎదురగు ప్రతికూల జీవనాన్ని సూచిస్తున్నది.

    కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురగును. మధ్య మధ్య యోగ వంతమైన అనుకూల ఫలితాలు, మధ్య మధ్య ప్రతికూల ఫలితాలు పొందుతారు. 15 మే 2025 వరకు ఆర్ధిక పరంగా అనుకూలత ఉంటుంది. వ్యాపార పరంగా భారీ పెట్టుబడులు పెట్టుటకు ఇది అనుకూలమైన కాలం. కోర్టు విషయాల్లో న్యాయ పరమైన అడ్డంకులు అన్ని తొలగును. శత్రువులపై విజయం లభిస్తుంది. ఈ కాలంలో మిక్కిలి న్యాయవంతంగా విశేష ధనార్జన చేయగలుగుతారు. 16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు గురు గ్రహం వలన తీవ్ర ప్రతికూల ఫలితాలు పొందుతారు. ధర్మ కార్య సంబంధ వ్యయం అధికం అవుతుంది. పితృ వర్గానికి కూడా మంచిది కాదు. వారసత్వ పరంగా పొందిన సంపదల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. అనవసరమైన శత్రుత్వాలు ఎదుర్కొనవలసి వస్తుంది. 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశి వారు తిరిగి అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ కాలం సంపూర్ణంగా యోగవంతమైన జీవితాన్ని ప్రసాదించును. విద్య పరంగా, ఉద్యోగ పరంగా స్థిరత్వానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం. 6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చ్ 2026 వరకు ప్రతికూల ఫలితాలు పొందుతారు. ఏ విధంగానూ గురు గ్రహం యొక్క బలం జాతకులకి లభించదు. జాతకంలో గురు గ్రహ బలం పూర్తిగా లోపించిన వారు పైన తెలియచేసిన ప్రతికూల కాలములలో గురు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది. 

    కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఆరోగ్య పరంగా, వైవాహిక సంతాన విషయ పరంగా, పితృ వర్గ పరంగా ఈ సంవత్సరం శనైచ్చారడు కర్కాటక రాశి వారికి ఇబ్బందులు కలుగ చేస్తారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని లేనప్పటికీ గోచార రీత్యా తీవ్ర వ్యతిరేక స్థానంలో ఉండడం వలన తరచుగా శనికి నల్ల నువ్వుల తైలాభిషేకం చేయించుకొనుట మంచిది. శనివారములు పగటి పూట ఉపవాశం ఆచరించుట మంచిది.  కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. 

    కర్కాటక రాశి వారికి  శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 18 మే 2025 వరకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. వైద్య రంగంలోని వారికి ఈ కాలం చక్కటి ఆర్ధిక లాభాలను కలుగచేస్తుంది. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. 19 మే 2025 నుండి ప్రతికూల ఫలితాలు ప్రారంభం అవుతాయి. తలపెట్టిన ప్రతీ కార్యక్రమం కోసం మిక్కిలి శ్రమించవలసి వస్తుంది. ఆరోగ్య ధృడత్వం తగ్గుతుంది. అనవసర శత్రుత్వాలు, ఆర్ధిక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. 

    కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా మిశ్రమ ఫలితాలు ఎదురగును. 18 మే 2025 వరకు పూర్తి అనుకూల ఫలితాలు పొందుతారు. అన్ని విధములా బాగుండును. 19 మే 2025 నుండి రాహు గ్రహం వలనే ప్రతికూల ఫలితాలు ప్రసాదించును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగి ఉన్నవారు అధికంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి రావచ్చు. కాల సర్ప దోషం కలిగిన వారు తరచుగా శ్రీ సుభ్రమన్యస్వామి వారి ఆరాధన - అభిషేకములు జరిపించుకోనుట సమస్యలను తగ్గించును.

    ఏప్రిల్ 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధనాదాయం కొంత వరకు తగ్గును. ఉద్యోగ జీవనంలో స్థానచలనం ఏర్పడును. విదేశీ సంబంధ నివాస ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. వాహనాల వలన ధనవ్యయం అధికంగా ఏర్పడును. ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక చికాకులు బాధించు సూచన. విద్యార్ధులు శ్రమించవలెను. వ్యాపార వర్గం వారు 14 తేదీ తదుపరి లాభాపడుదురు. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి స్థిరమైన ఆలోచనా విధానం అవసరం. మిత్రుల వలన సమస్యలు ఏర్పడును. కుటుంబ సభ్యుల సహాయం అవసరమగు సంఘటనలు ఎదురగును. ఈ మాసంలో 5, 9, 13 తేదీలు అనుకూలమైనవి కావు.

    మే 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసం కళారంగం లోని వారికి, మీడియా రంగంలో పనిచేయు వారికి చక్కటి ఫలితాలు కలుగచేయును. ఆర్ధికంగా లాభించును. వివాహ ప్రయత్నాలు సులువుగా విజయం పొందును. వైవాహిక జీవనంలో సంతోషకరమైన సంఘటనలు ఏర్పడును. పుణ్యక్షేత్ర సందర్శన సూచనలు కలవు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వారసత్వ సంబంధ సమస్యలు తగ్గుముఖం పట్టును. 12 నుండి 19 వ తేదీ మధ్య కాలం ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు లేదా ఆకస్మిక ఉద్యోగ నష్టం ఎదురగు సూచన ఉన్నది. 20వ తేదీ తదుపరి చేపట్టిన పనులు నిదానంగా పూర్తీ అగును. తీసుకొనే నిర్ణయాలలో ఆవేశ పడకుండా ఉండటం అవసరం. ఈ మాసంలో కాలి నరములకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి సగటు ఆదాయం తగ్గును.

    జూన్ 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో సంతాన ప్రయత్నాలలో కొంత కాలంగా ఏర్పడుతున్న అడ్డంకులు తొలగును. పుత్ర సంతాన సౌఖ్యమునకు సూచనలు కలవు. నూతన ఆలోచనలు కార్య రూపం దాల్చును. మిత్ర వర్గంతో ఉన్న వివాదములు తొలగును. స్వ శక్తితో గౌరవ ప్రధమైన జీవనాన్ని ఏర్పరచుకొందురు. ఉద్యోగ జీవనంలో అభీష్టాలు సిద్ధించును. నూతన అధికారములు లభించును. ఈ మాసం వ్యాపార వర్గం వారికి మంచి ప్రోత్సాహకరమైన కాలం. ఈ మాసంలో 12 నుండి 16 వ తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవనమునకు సంబంధించిన ఒక శుభ పరిణామం ఏర్పడును. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు కలసివచ్చును. 24 తేదీ తదుపరి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వలన అశాంతి, ధనవ్యయం ఎదురగు సూచన.

    జూలై 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్ధిక సమస్యలకు, మానసిక అశాంతికి దారితీయు సూచనలు కలవు. ఈ మాసంలో ప్రధమ వారం మంచి ఫలితాలు ఏర్పడవు. ఈ వారంలో ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారముల వలన అపకీర్తి, గౌరవ హాని పొందు సూచన. కర్కాటక రాశి పురుషులకు పరభార్యసక్తి వలన తీవ్ర సమస్యలు ప్రాప్తించును. ఉద్యోగ జీవనంలో భాద్యతలను చివరి నిమిషంలో పూర్తీ చేయగలుగుతారు. ప్రశంసలు పొందుతారు. పై అధికారుల సూచనలు ఉపయోగపడును. మాసం చివరి వారంలో శుభాకార్యక్రమాలలో పాల్గొందురు.

    ఆగష్టు 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో పితృ వర్గం వారి నుండి ఎదురుచూస్తున్న సహాయం లభించును. నూతన వాహన కోరిక ఫలించును. వ్యాపార వ్యవహారములలో జయం ప్రాప్తించును. ధన సమస్యలు తొలగును. యువకులకు ఉద్యోగ పరమైన లాభములు ప్రాప్తించును. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉపకార వేతనాలు పొందుతారు. మాసం ద్వితీయ అర్ధ భాగంలో ప్రయాణాలు ఏర్పడును. తలపెట్టిన ప్రయాణాలు లాభించును. సక్రమంగా ఆలోచించ గలుగుతారు. ఉద్యోగ జీవనంలో సామాన్య యోగం కొనసాగును. మాసాంతంలో కుటుంబ పరిస్థితులలో నూతన వ్యక్తుల ప్రవేశ సూచనలు కలవు. ఈ రాశి మహిళలకు వారి పేరుమీద చక్కటి భూ సంపద ఏర్పడు యోగము కలదు. ఈ మాసంలో 4, 7, 10, 19.21 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

    సెప్టెంబర్ 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ప్రారంభం నుండి 20 వ తేదీ వరకూ ఉద్యోగ , వ్యాపార వ్యవహారాలు ఇబ్బందులు ఎదుర్కొనును. ఆశించిన విజయాలు చివరి నిమిషంలో చేజారును. ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. 21 వ తేదీ తదుపరి రావలసిన బాకీలు వసూలు అగును. ఆర్ధికంగా కొంత ఒత్తిడి తగ్గును. పని భారం కూడా తగ్గును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందును. అదృష్టం కలసి వచ్చును. గృహ నిర్మాణ పనులలో అడ్డంకులు తొలగిపోవును. ఒక చిరకాల వాంఛ నెరవేరుతుంది. 28, 29 తేదీలలో అపవాదులు ఎదుర్కొనుటకు సూచనలు కలవు.

    అక్టోబర్ 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొను అవకాశములు అధికం. పారమార్ధిక చింతన అధికమగును. కొంత వరకు సంతృప్తికర పరిస్థితులు ఎదురగును. ఉద్యోగ జీవులకు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవలసిన సమయం ఏర్పడును. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం ఆశిస్తున్న వారికి ఈ మాసంలో ద్వితీయ లేదా తృతీయ వారాలలో వెతలు తీరును. విద్యార్ధులకు చక్కని భవిష్యత్ లభించును. వ్యాపారములు వృద్ధి చెందును. ఆశించిన ధనాదాయం లభించును. కోర్టు కేసులు అనుకూలంగా ముగియును. నూతన మిత్ర వర్గం ఏర్పడును. ఈ మాసంలో 23, 24 తేదీలలో ప్రయనములందు జాగ్రత్తగా ఉండవలెను.

    నవంబర్ 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో కళత్ర సంబంధ విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలందు అనుకూలత ఏర్పడును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం తక్కువ అగును. సుఖ వ్యాధుల వలన బాధపడు సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో వివాదాలు అశాంతిని కలుగ చేయును. భూ లేదా గృహ సంబంధ వ్యాపారాదులలో నష్టం ఏర్పడును. ఇతర వ్యాపార వర్గములకు ధనాదాయం సామాన్యం. ఈ మాసంలో వృధా ధనవ్యయం అధికంగా ఎదుర్కొందురు. ఈ మాసంలో 12, 13, 14, 18, 22, 26 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

    డిసెంబర్ 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో సమస్యలు చాలా వరకు తగ్గును. ఆలోచనలు కార్యరూపం దాల్చును. కుటుంబ ఖర్చులు తగ్గించగలుగుతారు. సోదర వర్గం వారితో సమస్యలు కొనసాగును. ఉన్నత అధికారులతో చేసే చర్చలు ఫలించును. ఉద్యోగ సమస్యలకు పరిష్కారములు లభించును. తృతీయ వారంలో సంతాన అనారోగ్యత వలన చికాకులు ఏర్పడును. విదేశీ జీవన ప్రయత్నాలు, ఉద్యోగంలో ప్రమోషన్లకు చేసే ప్రయత్నాలలో విఘ్నాలు ఎదుర్కొందురు. వివాహ ప్రయత్నాలకు కూడా ఇబ్బందులు ఎదురవును. స్త్రీలు మానసిక ఆందోళనకు లోనగు పరిస్థితులు ఏర్పడును. ఈ మాసంలో చేసిన భూమి లేదా గృహ సంబంధ రుణాలు అంత త్వరగా తీరవు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండవలెను. వాయిదా వేసుకోవడం మంచిది.

    జనవరి 2026 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆశించిన ధనాదాయం లభించును కాని కుటుంబ సభ్యుల వలన జరిగే నమ్మక ద్రోహం, పై అధికారుల వలన ఏర్పడు సమస్యలు, పని ఒత్తిడి , నేత్ర సంబంధ ఆరోగ్య సమస్యలు మానసికంగా దిగులు ఏర్పరచును. చేపట్టిన పనులు నిదానంగా పుర్తిఅగును. ఈ మాసం మీ సహనానికి పరీక్షాకాలం. గర్భవతులు జాగ్రత్తగా ఉండవలెను. చివరి వారంలో బంధు వర్గం వారితో చికాకులు, పెద్ద వయస్సు వారికి జీర్ణ సంబంధ సమస్యలు. విందు - వినోద కార్యములకు దూరంగా ఉండుట మంచిది. పోలిసుల వలన ఇబ్బందులకు అవకాసం ఉన్నది.

    ఫెబ్రవరి 2026 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో సమస్యలు తగ్గును. ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహం లభించును. ఉన్నత మార్పును ఈ మాసంలో ఆశించవచ్చు. వైవాహిక జీవన సమస్యలు కూడా తగ్గును. విదేశీ జీవనమును కోరుకుంటున్న వారికి శుభ ఫలితాలు. కుటుంబ అనారోగ్యత తగ్గుముఖం పట్టును. చేజారిన వివాహ సంబంధాలు తిరిగి వచ్చుటకు సూచనలు అధికం. ఈ మాసంలో సువర్ణ సంబంధ కొనుగోలు, పెట్టుబడులు లాభించును. 11 వ తేదీ నుండి 22 తేదీలు గత కాలంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించుటకు అనుకూలమైనవి. పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవడానికి , బంధుత్వాలను తిరిగి కలుపుకోవడానికి ఈ మాసం మంచి కాలం. 25, 26, 27, 28 తేదీలలో కాంట్రాక్టు పనులు చేయు వారికి, వడ్డీ వ్యాపారం చేయువారికి మంచి ధన లాభములు ఏర్పడును.

    మార్చ్ 2026 కర్కాటకరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చును. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సామాన్య యోగమును కలుగచేయును. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవనంలో నూతన వ్యక్తీ వలన తీవ్ర మానసిక ఆందోళన అనుభవిస్తారు. నిరుద్యోగులకు కూడా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఆశించిన ఉద్యోగాలు చివరి నిమిషంలో చేజారిపోవును. నరఘోష వలన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. మితభాషణం మంచిది. ఈ మాసంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతీ పని స్వయంగా చేసుకోవడం మంచిది. తగాదలలో సర్దుకుపోవడం ఉత్తమం.