మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన అంత అనుకూల ఫలితాలు ఏర్పడవు. సంవత్సర ప్రారంభం నుండి 19 అక్టోబర్ 2025 వరకు కుటుంబ పరమైన విషయాల వలన అధిక ధన వ్యయం ఎదుర్కొంటారు. తండ్రి వర్గం వారితో స్థిరాస్థి సంబంధ విషయాలలో తగవులు ఎదుర్కొంటారు. కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. ధన వ్యయాన్ని ఎంతగా అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించినా తప్పనిసరి భాద్యతలకు ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగ జీవనం చేయువారికి అఖస్మిక నష్టములు ఎదురవడానికి సూచనలు అధికంగా ఉన్నాయి. 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు మేషరాశి వారికి గురువు కొంత అనుకూల ఫలితాలు ప్రసాదిస్తారు. ముఖ్యంగా విద్యార్దులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ రంగం వారికి మరియు పర దేశములందు నివాస ప్రయత్నములు చేయువారికి మనోవాంచా ఫలసిద్ధి లభిస్తుంది. ఈ కాలంలో ఉద్యోగ జీవనం వారు ప్రమోషన్లు అశించవచ్చు. నూతన పదవులు మరియు సన్మానాలు పొందుతారు. 6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చి 2026 వరకు గురు గ్రహం యొక్క ప్రతికూల ప్రభావం వలన కుటుంబ జీవనంలో సమస్యలు ఎదురగును. భాత్రు వర్గీయులతో మనస్పర్ధలు ఎదురగును. నిరుద్యోగుల ప్రయత్నాలకు అదృష్టం అవసరం. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి గురువు అధిక భాగం ప్రతికూల ఫలితాలు ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం పూర్తిగా లోపించిన వారు జాగ్రత్తగా ఉండవలెను.
మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు, అధిక ధనవ్యయం, వ్యాపార వర్గం వారికి నష్టములు, రియల్ ఎస్టేట్ రంగం వారికి తీవ్ర ప్రతికూలత ఎదురగును. చేతికి రావలసిన ధన లాభములు ఆఖరి నిముషములో చేజారి పోవును. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మే మాసంలో శని యొక్క ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కుజ గ్రహ మరియు శని గ్రహ దోషం ఉన్న వారికి కోర్టు వ్యవహారాలలో లేదా చట్ట రీత్యా బంధన యోగం ఎదురగు సూచనలు అధికంగా ఉన్నవి. తగవులందు రాజీ పడడం మంచిది. మొత్తం మీద మేషరాశి వారు ఈ సంవత్సరం తరచుగా శనికి తైలాభిషేకములు, జపములు జరిపించుకోనుట మంచిది.
మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 18 మే 2025 వరకు వ్యతిరేక ఫలితాలు ఎదురగును. మానసికంగా బాధ పడవలసిన, అవమానములు పొందవలసిన పరిస్టితులు ఎదురగును. 19 మే 2025 నుండి అతి చక్కటి అనుకూల ఫలితాలు ప్రసాదించును. రాబడి కొంత పెరుగుతుంది. వ్యయాన్ని ఒక వంతు తగ్గించుకోనగలుగుతారు. రాహు గ్రహ అనుగ్రహం వలన సంతాన దోషాలు తొలగి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ సంవత్సరం రాహు గ్రహం వలన అధిక భాగం అనుకూల ఫలితాలనే పొందుతారు.
మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య కాలంలో దీర్గకాళిక రుణాలు తీర్చివేస్తారు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భరణీ నక్షత్ర జాతకులకు కుటుంబ సమస్యలు తగ్గుతాయి. వ్యక్తిగత విషయాలలో ఆనందకర సంఘటనలు ఎదురగును. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం కేతు గ్రహం వలన చక్కటి లాభములు ఎదురగును. ఈ సంవత్సరం మేషరాశి కి చెందిన కాల సర్ప దోష జాతకులకు సర్ప దోష ప్రభావం కూడా కొంత తగ్గును.
ఏప్రిల్ 2025 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామి మూలాన స్థిరాస్తి లేదా సువర్ణ లాభం లభిస్తుంది. ఊహించని విధంగా ఒక తగాదా వలన చికాకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారముల వలన సామాన్య ధన సంపాదన. గృహంలో కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణాపూర్వక వాతావరణం ఏర్పడి ఉండుట మిమ్మల్ని బాధిస్తుంది. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఒత్తిడి , శ్రమ అధికం అవుతాయి. మాసాంతంలో వ్యసనాల వలన వృధా వ్యయం ఎదుర్కొంటారు. నిర్లక్ష్యం వలన కార్యవిఘ్నత బాదిస్తుంది. ప్రభుత్వ రంగ కాంట్రాక్టులు చేయు వారికి ఆర్ధిక వ్యవహారములలో అననుకూలత. ఈ మాసంలో 3, 6, , 24 , 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు.
మే 2025 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. మీ ప్రమేయం లేకుండా అవమానములు, అపవాదులు భరించవలసి వచ్చును. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా ఆసక్తి కలిగివున్న వారికి ఆశించిన పదవులు, ఉన్నత హోదా పొందుటకు ఇది అనువైన కాలం. విదేశీ సంబంధ స్థిర నివాసం కొరకు చేయు ప్రయత్నాలు ద్వితీయ వారంలో ఫలించును. తృతీయ వారంలో నిద్రలేమి సంబంధిత ఆరోగ్య సమస్యల వలన సమస్యలు ఎదుర్కొంటారు. మాసాంతంలో మీ ప్రతిభకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. నూతన గృహ నిర్మాణ సంబంధ పనులు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం ఏర్పడును. ఈ మాసంలో 8 , 10 , 14, 17 తేదీలు అనుకూలమైనవి కావు. పేర్కొన్న తేదీలలో ప్రయాణాలు చేయుట అంత లాభించదు.
జూన్ 2025 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలు ఎదురగును. వ్యక్త్రిగత జీవనంలో అవిధేయత వలన సమస్యలు పొందుతారు. ద్వితియ తృతీయ వారములలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ఆఖస్మిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితం లభించదు. అతిగా ఆశ పడుట వలన మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటారు. చివరి వారంలో ఉన్నత హోదాలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడును. వివాహ ప్రయత్నాలలో అడ్డంకులు. ఆర్ధిక పరంగా కొంత వృద్ది కనిపిస్తుంది. వ్యవసాయ సంభందిత రంగంలోని వారికి తీవ్ర వ్యయం ఏర్పడును. విద్యార్ధులకు ఈ మాసం అంత మంచి కాలం కాదు. విద్యావిఘ్నములను ఎదుర్కోను సూచన. మాసం మొత్తం మీద ధనాదాయం సామాన్యం.
జూలై 2025 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం కొంత వృద్ధి చెందును. వృత్తి వ్యాపార ఉద్యోగ జీవనాలు బాగానే ఉండును. సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు లభించును. ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానములు ఏర్పడును. కుటుంబ సభ్యుల గౌరవం పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కోర్టు తగాదాలు, వివాహ సంబంధ మరియు స్థిరాస్థి సంబంధ వివాద విషయములందు లాభములు పొందుతారు. 15, 16, 17, 18 తేదీలలో శుభ వార్తలు వినుదురు. చివరి వారంలో ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడు సూచన. మొత్తం మీద ఈ మాసం అన్ని వర్గముల వారికి అనుకూలంగా ముగుస్తుంది.
ఆగష్టు 2025 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసం అవివాహితుల వివాహ ప్రయత్నములకు అనుకూలంగా ఉండును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక వలన ఆనందకర సమయం ఏర్పడుతుంది. కుటుంబ బలం పెరుగుతుంది. నూతన కార్యములు ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో కోరుకున్న విధంగా శాంతి పొందుతారు. చేయుచున్న వ్యాపారములు విస్తరించే అవకాశములు లభించును. తృతీయ వారంలో వ్యక్తిగత జీవనంలో సమస్యలు తొలగును. చివరి వారంలో 26, 28, 30 తేదీలలో చేయు ప్రయత్నాలు మంచి ఫలితాలను కలిగించును.
సెప్టెంబర్ 2025 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం ప్రాప్తించును. భాగస్వామ్య వ్యవహారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి జీవనంలోని వారికి సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఏర్పడును. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. అనుకొన్న సమయానికి పనులు పూర్తి అవ్వవు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. జీవిత భాగస్వామికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. ఈ మాసంలో 26, 27, 28 తేదీలలో పెద్ద వయ్యస్కులకు హృదయ సంబంధ ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచన. ఈ మాసంలో ధనాదాయం బాగుండును.
అక్టోబర్ 2025 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలలో ఊహించని నష్టం. గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండవలెను. ధనాదాయం సామాన్యంగానే ఉండును. ప్రధమ వారంలో ప్రారంభించు వ్యాపారములు విజయవంతం అగును. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవనంలో సమస్యలు తొలగి ఉన్నతి ఏర్పడు సూచన. అందరి మన్ననలూ పొందుతారు. నూతన గృహ లేదా వాహన ప్రయత్నములు ఫలించును. విద్యార్దులకు చివరి వారంలో మానసికంగా క్రుంగదీయు ఆలోచనలు అధికంగా ఏర్పడును. ప్రేమకలాపముల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్ద వయస్సు వారికి ఆరోగ్య సమస్యలు కొనసాగును. ఈ మాసంలో ఒక పర్యాయం రుద్రాభిషేకం చేయించుకొనుట మంచిది.
నవంబర్ 2025 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో గృహంలో ఒక అశుభ సంఘటన ఏర్పడుటకు సూచనలు అధికంగా ఉన్నవి. వ్యక్తిగత విషయాల్లో మానసికంగా తీవ్ర సంఘర్షణ ఎదుర్కొందురు. ప్రశాంతత లోపించును. ఈ మాసంలో ఏర్పడు నూతన పరిచయాలు ఇబ్బంది పాలుచేయును. ముఖ్యంగా అశ్విని నక్షత్ర యువతులు జాగ్రత్తగా ఉండవలెను. ఈ మాసంలో ధన ఆదాయం సామాన్యం. ద్వితియ వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు ఎదురగును. మిత్రుల సహాయ సహకారములతో అడ్డంకులను అధిగమించెదరు. మిత్రుల సలహాలు ఉపయోగపడును. మూడవ వారంలో వ్యయం కొంత అధికమగు సూచన. ఈ మాసంలో 19, 20, 24 తేదీలు అనుకూలమైనవి కావు.
డిసెంబర్ 2025 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో గతకాలపు సమస్యలు కొంత వరకు తగ్గును. ఆర్ధిక ఋణముల నుండి విముక్తి లభించును. అనారోగ్య సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది కలిగించు సూచన. ప్రధమ వారంలో ఆకస్మిక ఆర్ధిక లాభములు ఏర్పడు సూచన. భాతృ వర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. వ్యక్తిగత జీవన సౌఖ్యం ఏర్పడును. తృతియ వారం విద్యార్దులకు అనుకూలంగా ఉండును. పరదేశ విద్య కోసం చెసే ప్రయత్నాలు లాభించను. గృహంలో బందువుల రాకపోకలు ఉండగలవు. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. గృహ నిర్మాణ సంబంధ మార్పు కోసం చేయు ఫలితాలు ఆటంకములతో ఫలించును. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం బాగుండును.
జనవరి 2026 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. నివాస గృహంలో దీర్ఘకాలంగా ఆశిస్తున్న అలంకరణ సంబంధ మార్పులు చేయగలుగుతారు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. గృహ సంతోషాలు సంపూర్ణంగా ఉండును. ప్రతీ వ్యవహారం ఆశించిన విధంగా నిదానంగా పూర్తిఅగును. 21వ తేదీ తదుపరి చేయు ప్రయనములందు జాగ్రత్త అవసరం. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ దోషం కలిగిన వారికి వాహన ప్రమాద సూచన లేదా ప్రయాణ సంబంధ ఆరోగ్య భంగం కలవు. ఈ మాసంలో 21, 24, 25 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో నల్లని వస్త్రములు ధరించకుండా ఉండుట మంచిది.
ఫెబ్రవరి 2026 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో ధనసంబంధమైన చికాకులు భాదించును. వృధా వ్యయం చేయకండి. ప్రధమ ద్వితీయ వారములలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. కష్టంతో కార్యవిజయం. విరోధుల వలన ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొందురు. పెద్దలకు వైరాగ్య భావన ఏర్పడగలదు. తృతీయ వారంలో కొంత ఒత్తిడి తగ్గును. సంతాన సంబంధ సుఖ సంతోషములు నెలకొనును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు లేదా చేయుచు ఉన్న ఉద్యోగ జీవనంలో మార్పు కొరకు చేసిడి ప్రయత్నాలు సఫలము అగును. ఈ మాసంలో 15 నుండి 22వ తేదీ మధ్య చేయు వివాహ ప్రయత్నములు విజయవంతం అగును.
మార్చ్ 2026 మేషరాశి రాశిఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ప్రధమ అర్ధ భాగంలో మంచి అనుకూల వాతావరణం ఏర్పడును. కుటుంబంలో చికాకులు తొలగును. పనులు వాయిదా పడకుండా ఆశించిన విధంగా పూర్తీ అగును. భాత్రు వర్గంతో ఘర్షణలు తొలగును. ఆశించిన ధనప్రాప్తిని పొందుతారు. ప్రయాణాలు సౌకర్యవంతంగా పూర్తీ అగును. గృహంలో బంధు లేదా స్నేహ వర్గ కూడికలు ఏర్పడును. విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి శుభం. ద్వితీయ అర్ధ భాగంలో ధన అవసరములు పెరిగి మానసిక ఆందోళన ఏర్పడును. కుటుంబంలోని పెద్దవయ్యస్సు వారికి అనారోగ్య సమస్యలు కొనసాగును.